హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం ఎన్హెచ్-65 జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే పనులు నవంబరు చివరి నాటికి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. సుమారు 285.99 కిలోమీటర్ల మేర రూ.12,073.99 కోట్ల అంచనా వ్యయంతో ఈ విస్తరణ చేపట్టనున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైవే సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దసరా నాటికి ధర్మోజిగూడ, చిట్యాల ఫ్లైఓవర్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే సంక్రాంతి నాటికి మిగిలిన బ్లాక్ స్పాట్లలో ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.












