భారత రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు విశాఖపట్నం, నాగ్‌పూర్ వంటి టైర్-2, టైర్-3 నగరాల్లోనూ ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. సీఐఐ, నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక ప్రకారం దేశంలోని 11 వర్ధమాన నగరాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఆకర్షణీయ ప్రాంతాలుగా మారుతున్నాయి. మెరుగైన రహదారులు, విమానాశ్రయాలు, ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి ఈ నగరాల వృద్ధికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. తక్కువ పెట్టుబడి వ్యయం, మెరుగైన కనెక్టివిటీ, పెరుగుతున్న ఉపాధి అవకాశాలతో నివాస, వాణిజ్య ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. రాబోయే కాలంలో టైర్-2 నగరాలు భారత రియల్ ఎస్టేట్ వృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.












