హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లోని ఆదిత్య క్యాపిటల్ హైట్స్ ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసిన అమెరికాలో నివసిస్తున్న వంశీధర్ మోతిపల్లి ఆరేళ్లుగా స్వాధీనం కోసం ఎదురుచూస్తున్నారు. 2018 మార్చి 23న 11వ అంతస్తులో 2,125 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ.1.02 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.85.55 లక్షలు చెల్లించినప్పటికీ ఫ్లాట్ అప్పగించలేదని TG-RERAను ఆశ్రయించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఆలస్యం కూడా సమస్యగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును పరిశీలించిన TG-RERA రూ.1 లక్ష మానసిక వేదనకు, రూ.20,000 న్యాయ ఖర్చులకు కలిపి మొత్తం రూ.1.20 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 60 రోజుల్లో చెల్లించకపోతే 10% వార్షిక వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.












