అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ (CRDA) స్పష్టత ఇచ్చింది. 2014 డిసెంబర్ 8ను కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ తేదీకి ముందే నిర్మాణాలు ఉన్న భూములకు గ్రామకంఠం పరిధిలో మినహాయింపు కల్పిస్తామని పేర్కొంది. అయితే కటాఫ్ తేదీ తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్లకు ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.ఇప్పటివరకు ఎల్పీఎస్ (LPS) నుంచి 6,473.72 ఎకరాలకు మినహాయింపు ఇచ్చినట్లు CRDA వెల్లడించింది. ఇంకా పరిష్కారం కాని 685 దరఖాస్తులపై జిల్లా స్థాయి కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతోంది. రికార్డులు, శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన అనంతరం జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం అన్ని ప్రయోజనాలు అందిస్తామని CRDA తెలిపింది.












