తెలంగాణ ప్రభుత్వం మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు పేర్లను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమ, ఆదిలాబాద్ విమానాశ్రయానికి కొమురం భీమ్ పేర్లను ప్రతిపాదించింది. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, పలుమార్లు జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పేర్లతో కూడిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నట్లు సమాచారం. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాయనున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన తర్వాత గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది. మామునూరు విమానాశ్రయానికి సమ్మక్క-సారలమ్మ పేరును కూడా ప్రభుత్వం పరిశీలించినట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల డిజైన్లలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.












