మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో నిర్మించనున్న శ్రీ ఓంకారేశ్వర ఆలయ సముదాయానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆలయ నిర్మాణానికి రూ.948.65 కోట్లు, ఆలయాన్ని కలిపే ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.159.62 కోట్లు కలిపి మొత్తం రూ.1,108.27 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.ఈ ఆలయ సముదాయంలో శ్రీ వీరభద్రుడు, భద్రకాళి, లలితా త్రిపురసుందరి, బాలగణపతి, బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయాలతో పాటు మహామండపం, రాజగోపురం, యాగశాల, పుష్కరిణి, భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో రూ.700 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టుకు తాజాగా నిధులు పెంచడం విశేషం.












