తెలంగాణలో 22-A నిషేధిత భూముల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని అక్రమంగా భూకబ్జాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SET) ఏర్పాటు చేసి విచారణ చేపడతామని అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో సుమారు రూ.1 లక్ష కోట్ల విలువైన భూములు పేదలకు చెందాల్సినవని, అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ సీఎం ఆరోపించారు. 22-A జాబితాలోని భూములపై కలెక్టర్లు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారని, బాధితులకు అప్పీల్ అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. భూ వివాదాల పరిష్కారానికి భూ భారతి చట్టం ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.












