హైదరాబాద్లో ఫ్లాట్ కొనుగోలుదారుడికి తెలంగాణ RERA (TG RERA) కీలక తీర్పు ఇచ్చింది. శేరిలింగంపల్లి మండలంలోని ఆదిత్య క్యాపిటల్ హైట్స్ ప్రాజెక్టులో ఫ్లాట్ కోసం మోతిపల్లి వంశీధర్ 2018లో రూ.1.02 కోట్లకు ఒప్పందం చేసుకుని, రూ.85,55,367 చెల్లించారు. అయితే ఆరేళ్లు గడిచినా ఫ్లాట్ నిర్మించి అప్పగించకపోవడంతో ఆయన TG RERAను ఆశ్రయించారు. విచారణ అనంతరం, చెల్లించిన రూ.85.55 లక్షలను 10.75% వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని RERA ఆదేశించింది. మానసిక క్షోభ, ఫిర్యాదు ఖర్చుల కోసం అదనంగా రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని ఆదేశాల తేదీ నుంచి 60 రోజుల్లోపు చెల్లించాలని సంస్థకు గడువు విధించింది.












